మంచిర్యాల : మంచిర్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తహసీల్దార్ కార్యాలయంలోనే ఓ విఆర్ఓ ను దుండగులు కత్తులతో నరికి కిరాతకంగా హత్య చేశారు. మారుమూల ప్రాంతమైన కన్నెపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం తెల్లవారుజామున ఈ సంఘటన వెలుగుచూసింది.
సోమవారం ఉదయం రక్తపు మడుగులో పడి ఉన్న విఆర్ఏ(సుంకరి) దుర్గంబాబును గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. బెల్లంపల్లి ఏసీపి ఎడ్ల మహేష్, ఆర్డిఓ శ్యామలా దేవి సంఘటన స్థలాన్ని సందర్శించి ప్రజలతో మాట్లాడారు.

వ్యక్తిగత కక్షలతో హత్య జరిగిందా లేక భూ వివాదాల వల్ల ఈ సంఘటన చోటుచేసుకుందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. కాగా దుర్గం బాబు కొత్తపల్లి వీఆర్ఏగా పనిచేస్తున్నాడు. కన్నెపల్లి తహసీల్దార్ కార్యాలయంలో రాత్రిపూట విధులు నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కొత్తపల్లి గ్రామంలో ఓ వ్యక్తి గత కొన్ని రోజులుగా చంపేస్తామని బెదరిస్తున్నారని, అదే విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని దుర్గంబాబు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అతనే బాబును హత్య చేసి ఉంటాడని ఆరోపణలు చేస్తున్నారు. సంవత్సరం క్రితం ఓ మహిళ విషయమై కూడా బాబు వివాదాస్పదంగా వ్యవహరించాడనే ఆరోపణలున్నాయి. వీటికి తోడు బాబు కు సంబంధించిన ఉద్యోగం విషయంలో కూడా బంధువులలో విభేదాలు తలెత్తినట్లు కూడా ఆరోపణలున్నాయి. కాగా ఈ విషయమై కుటుంబ సభ్యులు మాట్లాడుతూ దుర్గం బాబును హతమార్చిన దుండగులను కఠినంగా శిక్షించాలని కోరారు.మృతునికి భార్య, నలుగురు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు.
